తెలుగు సెక్సు కథలు 5

మనకు కథలు కొత్తవేం కాదు. చిన్నప్పటి నుండి కథలు వింటునే ఉన్నాం. చిన్నప్పుడు ప్రతీ రోజు అమ్మమ్మ దగ్గరో, నాన్నమ్మ దగ్గరో, అమ్మ ఒళ్ళోనో కూర్చుని కథలు వినేఉంటాం. ఆ కథలు సామాన్యంగా ” అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. వాళ్ళంతా కలిసి వేటకు వెళ్ళారు…” అనే రీతిలోనే ఎక్కువగా ప్రారంభమవుతాయి. ఈ కథలు ఆ రాజులు, రాజ కుమారుల గురించి చెప్పటమే కాక మనకు నీతిని, విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. అలాంటిదే రా.వి. శాస్త్రి రాసిన కథ “పాతదే కథ”.

   రా.వి. శాస్త్రి “పాతదే కథ” కూడా “అనగనగా ఒక భూకామందు. ఆయనకు ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళంతా కూలీల వేటకు వెళ్ళారు…” అనే పాత పద్ధతిలోనే ప్రారంభమయింది. అయితే చెప్పిన పద్ధతి పాతదే అయినా ఇందులోని విషయం కొత్తది. పాత కథల్లో మనకు రాజులు, రాకుమారులు కనిపిస్తే ఈ కథలో భూకామందు అతని కొడుకులు కనిపిస్తారు..

   ఈ కథలో భూకామందు ఏడుగురు కొడుకులు వేటకి వెళ్ళి ఏడుగురు ఎండు కూలీలను తెచ్చి వారి చేత బండ రాళ్ళను తవ్విస్తారు. ఒకరోజు వాళ్ళలో ఒకడు ఎండకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడు భూకామందు కొడుకులు తమ సెక్రటరీని, సెక్రటరీ మేనేజరునీ, మేనేజరు లేబర్ ఆఫీసర్‌నీ, లేబర్ ఆఫీసర్‌ డాక్టర్‌నీ పిలుస్తారు. డాక్టర్ వచ్చి ఆ ఎండుకూలీని చూసి ‘నూరేళ్ళు నిండి చనిపోయాడు’ అని చెప్పి బిళ్ళు తీసుకొని వెళ్తాడు. భూకామందు కొడుకులకు అనుమానం కలిగి డాక్టర్‌ని రహస్యంగా అడగగా ‘తిండిలేక పోవటం వల్లనే చనిపోయాడని’ చెప్తాడు. దాంతో వారంతా సమావేశమవుతారు. అప్పటికే కూలీలకు మంచినీళ్ళు ఇస్తున్నామని, ఇప్పుడు పచ్చమన్ను ఇస్తే వారికి వస్తున్న 200 రూపాయల లాభంలో పావలా నష్టం కలుగుతుందని పెద్దవాడు చెప్తాడు. దీంతో కొడుకులంతా కూలీలకు నీళ్ళు తప్ప ఏమీ ఇవ్వరాదని నిర్ణయించుకుంటారు. తర్వాత మిగతా ఆరుగురు ఎండుకూలీలు చస్తారు. యజమానులు మళ్ళీ వేటకు వెళ్ళి  మరో ఏడుగురు కూలీలను పట్టుకు వస్తారు. ఇలా ఐదుసార్లు జరుగుతుంది. అపుడు యజమానులకు 200 రూపాయలకు  బదులు 150 రూపాయల లాభం మాత్రమే వస్తుంది.

   ఏడుగురు కొడుకులు గుండెలు బాదుకుంటూ నాన్న భూకామందు దగ్గరకు వెళ్తారు. వారి మాటలు విన్న భూకామందు ‘మనం బతకాలంటే కూలీలు చావకూడదు. వారు కూడా బతకాలి. చస్తే లాభం ఉండదు కనుక వారిని కొన ఊపిరితో ఉంచాలి . అందుకే వారికి ఇంత గడ్డి వేయండి. అప్పుడప్పుడు ఇంకా ఎక్కువగా గడ్డి పెట్టండి. కానీ, చదువు మాత్రం అందించకండి. ఇంకా సెక్సు సినిమాలు చూపించండి. సురాపానం చేయించండి. మరొక రెండు గడ్డి పరకలు పడవేయండి. కానీ, వారు విజ్ఞాన దీపాలు వెలిగించుకోకుండా చూడండి’ అని చెప్తాడు.

   నాన్నగారి ఉపదేశం విన్న ఏడుగురు కొడుకులు ఆ రోజు నుండి కూలీలకు రెండు గడ్డి పరకలు, మూడు చుక్కలు ఉప్పునీరు అందించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారంతా ఒక చోట చేరి “ఇదే ఇదే సోషలిజం” అన్నారు. అపుడు కొందరు కూలీలు కార్మిక నాయకులుగా మారి “అవునిదే సోషలిజం” అని అరచి కంపెనీ డాక్టరు లాగానే వాళ్ళు  కూడా డబ్బులు పుచ్చుకుని ఇంటికి వెళ్తారు. అయితే ఇందుకు బిళ్ళులు మాత్రం ఉండవు.

   స్థూలంగా ఇదీ కథ. కథ అంతా అయ్యాక “పెద్దవాళ్ళు కథ కంచికి మనమింటికి” అంటుంటారు. కానీ, రచయిత “ఈ కథ కంచికి వెళ్ళలేదు అంటాడు” అంటాడు. “ఎందుచేతనంటే ఎండు కూలీలు ఎండలోనే ఉన్నారు. భూకామందులు, వ్యాపారపు కొడుకులు లాభాల వేటలో ఇంకా ఈ లోకంలోనే మన పీకల మీద ఉన్నారు” అని కారణం చెప్తాడు. ఈ కథ అప్పుడే కాదు ఇప్పుడు కూడా కంచికి చేరలేదు అని చెప్పవచ్చు.

   ఈ కథ పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల కష్టాలను, యజమానులు లాభాలను పొందే విధానాన్ని తెలుపుతుంది. సమాజం భూస్వామ్య వ్యవస్థ నుండి అప్పుడే పెట్టుబడిదారీ వ్యవస్థకు పరిణామం చెందుతున్న దశను ఈ కథ చిత్రించింది. ఈ కథలో భూస్వామ్య వ్యవస్థకు భూకామందు,  అతని కొడుకులు పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతీకలుగా కనిపిస్తారు. ఇందులో భూస్వాములే పెట్టుబడిదారులుగా మారిన వైనం చూడవచ్చు.  భూస్వామ్య వ్యవస్థ లో సంపద అంతా ఒకరి చేతుల్లోనే ఉండటం వల్ల రైతులే కూలీలుగా మారారు. అందువల్లనే భూకామందు కొడుకులకు ఐదుసార్లు ఏడుగురు కూలీలు తక్కువ కూలీకే లభిస్తారు. వారితో భూస్వామి కొడుకులు భూమిలో రాళ్ళను తవ్విస్తారు. భూమిలోని రాళ్ళు ప్రకృతి సంపద. దాన్ని వెలికి తీయడానికి యజమానులు పెట్టుబడి పెట్టనవసరం లేదు. కేవలం కూలీలచే పని చేయించి వారు లాభాన్ని పొందుతారు. దానికి ప్రతిఫలంగా వారు కూలీలకు మంచి నీళ్ళు ఇస్తారు. ఇది కూడా ప్రకృతి సంపదే. కాబట్టి యజమానులు లాభాలు పొందటమే తప్ప నష్టం పొందటం అంటూ ఉండదు. ఈ లాభాలకు రుచి మరగటం వల్లనే కార్మికుల తిండి కోసం తమ లాభంనుండి కేవలం పావలా వదులుకోవడానికి కూడా సిద్ధపడరు. చివరకు లాభాలు తగ్గడం వల్ల తండ్రి సలహాపై కూలీలకు తిండి పెడతారు. అది కూడా వారు చావకుండా, బతకకుండా ఉండటానికి. ఇది కేవలం యజమాని ప్రయోజనం కోసమే  తప్ప కార్మికుని సంక్షేమం కోసం కాదు.

   పెట్టుబడిదారీ వ్యవస్థలో యజమానులు, కార్మికులు మాత్రమే కాకుండా మరికొంత మంది ఉద్యోగులు ఉంటారు. వారే ఈ కథలో మేనేజరు, సెక్రటరీ, లేబరు ఆఫీసరు, డాక్టరు. వీళ్ళలో లేబర్ ఆఫీసర్, డాక్టర్ కార్మికుల సంక్షేమం కోసం నియమింపబడ్డవాళ్ళు. వాళ్ళు కార్మిక సంక్షేమం కన్నా యజమాని లాభాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.  కార్మికుని సంక్షేమం చూడాల్సిన లేబరు ఆఫీసరు సమయానికి డాక్టరుని తీసుకు రాకుండా అశ్రద్ధ వహిస్తాడు. దీంతో డాక్టర్ రావటం ఆలస్యం అయి కూలీ మరణిస్తాడు. వచ్చిన డాక్టర్ కూడా కూలీల ముందు నిజాన్ని కప్పి పెట్టి యజమాని లాభానికి దోహదపడతారు. తద్వారా తాను బిళ్ళు (డబ్బులు) పొందుతాడు. ఇది కూలీ వైద్యం కోసం ఖర్చు చేయబడటం వల్ల యజమానికి ఆ సొమ్ముపై ఆదాయపన్నునుండి మినహాయింపు కూడా ఉంటుంది యజమానికిది మరో విధంగా లాభం. కార్మికుల సంక్షేమం కోసం కార్మికులతో ఎన్నుకోబడ్ద నాయకులు కూడా డబ్బుకాశపడి యజమానికే వంత పాడతారు.

   ఈ విధంగా ఈ కథలో పెట్టుబడిదారీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కళాత్మకంగా చిత్రించాడు రావి శాస్త్రి.  ఈ నాటికి కూడా ఈ కథ అన్వయమవుతుందని చెప్పువచ్చు.ఈ కథలో భూకామందు కొడుకులకు ఒక సలహా చెప్తాడు. ‘కూలీలకు అవసరమైతే రెండు గడ్డి పరకలు ఎక్కువగానైనా వేయండి. కానీ, చదువు మాత్రం అందించకండి’ అని చెప్తాడు. ఇది భూస్వాములు పాటించారు. తర్వాతి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇది సాధ్యం కాలేదు. తమకు కావలిసిన ఉద్యోగాల కోసం వారికి చదువు అందించాల్సి వచ్చింది. సెక్సు సినిమాలు, సారాయి అలాగే కొనసాగుతున్నాయి.

   పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచీకరణ పేరుతో వికృతరూపం దాల్చింది. ఆ వ్యవస్థను ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. కార్మికుల కష్టాలు ఇంకా ఎక్కువవుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారుల లాభాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందుకే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారితో పాటూ బిలియనీర్లూ పెరుగుతున్నారు. ఈ మధ్యనే ప్రకటించిన బిలియనీర్ల జాబితాలో (జపాన్‌ లాంటి దేశాల్ని తోసివేసి) భారతీయుల సంఖ్య పెరగటం చూస్తూనే ఉన్నాం. వారు తమ పెట్టుబడులతో చిన్నచిన్న వ్యాపారాలను కూడా స్వాధీనం చేసుకుని లాభాలను ఆర్జిస్తున్నారు. ఆఖరుకి నెట్టుడు బండ్లపై సామానులను అమ్మేవారిని కూడా తమ కూలీలుగా మార్చుకుని లాభాలను ఆర్జిస్తున్నారు.

   ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో రైతుల దగ్గరి నుండి భూములను లాక్కొని మరీ పెట్టుబడిదారులకు పంచి పెడ్తున్నది . వారికి రాయితీలను, పన్ను మినహాయింపులను ఇస్తున్నది. రైతులకు ఉపాధి చూపిస్తున్నాం అనే నెపంతో స్వయంగా బ్రతికే వారిని కంపెనీలలో కూలీలుగా మారుస్తున్నది. ప్రతిఘటించిన వారిని చంపేస్తున్నది. పెట్టుబడిదారుల ఆదాయాన్ని కూడా లెక్కిస్తూ (ఈ కథలోని వ్యాపారులు, కార్మిక నాయకులు లాగా) “సోషలిజం” సాధిస్తున్నామని చెప్పుకుంటున్నది. అలాగే  (ఈ కథలో భూకామందు చెప్పినట్లుగా) ప్రజలను ఆలోచించనీయకుండా సెక్సు సినిమాలను, మద్యపానాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నది. ప్రజలకు పెట్టుబడిదారీ వ్యవస్థకు కావలిసిన చదువును మాత్రమే అందిస్తున్నది. మేనేజ్‌మెంటు, ఇంజనీరింగు, ఇంగ్లీషు విద్యలను ప్రోత్సహించటం సామాజిక శాస్త్రాలను నిర్వీర్యం చెయ్యటం ఇందులో భాగంగా చెప్పవచ్చు.

  ఇలా రా.వి. శాస్త్రి “పాతదే కథ” అనే పేరుతో కొత్త కథను రచించాడు. కొత్త వస్తువుని తీసుకుని “పాతదే కథ” లో కొత్తదనం చూపించాడు. ఈ కథ ఈ నాటికి కూడా కంచికి చేరక పోవటం, నేటి పరిస్థితులకు కూడా అన్వయింపబడటం మనం ఆలోచించదగ్గ విషయం.