అంతర్జాతీయ భాష, భావ ప్రసార వ్యవస్థలలో ‘గ్లోబిష్‘ ఇప్పుడు ఒక కొత్త సంచలనం. గ్లోబల్ – ఇంగ్లీష్ అనే రెండు మాటల సంకరం ‘గ్లోబిష్‘ (ఈ సంకర పద సృష్టికర్త ఎం.ఎన్.గొగాటే – భారతీయుడు. 1988లోనే ఈ పదాన్ని సృష్టించి హిందీ, ఇంగ్లీషు భాషలను వ్యాపార భాషలుగా మార్చే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి). సరళీకరించిన ఆంగ్ల వ్యవహారంగా గ్లోబిష్ తన పరిధిని, వ్యాప్తిని రోజు రోజుకీ విస్తృతం చేసుకొంటోంది. ఇటలీ, అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్, కొరియా, అమెరికా మొదలైన దేశాలలో ఈ భాష కాని ‘భాష‘ పట్ల విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. ఈ దేశాల్లోని బహుళ జాతి సంస్థలలో ఉద్యోగం సంపాదించాలంటే ‘గ్లోబిష్‘ మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి తీరాలన్నది నియమం కాబోతోంది.
‘భాష సంస్కృతికి వాహిక. చారిత్రక, సాంస్కృతిక అంశాలు ఏవీ గ్లోబిష్ ద్వారా వ్యక్తం చేయలేం. అంతర్జాతీయ సమాజాలలో మాట్లాడటానికి గ్లోబిష్ ఉపకరణం మాత్రమే‘ అని విస్పష్టంగా ప్రకటించినా గ్లోబిష్‌కు ఆదరణ తగ్గటం లేదు సరికదా పెరుగుతోంది. కాబట్టే గ్లోబిష్ అంతర్జాతీయ అధికార భాష కావాలన్నది తన ఆశయం అంటాడు జాన్ పాల్ నెరియె. ప్రెంచి జాతీయుడైన నెరియె 1980ల్లో అమెరికన్ కంపెనీ ఐబిఎమ్ వైస్ప్రెసిడెంట్ గా ఉండేవారు. విధి నిర్వహణలో జపనీస్, కొరియన్ భాషీయులతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలతో ‘గ్లోబిష్‘ను అభివృద్ధి పరచాలన్న ఆలోచన తనకు తొలుత కలిగిందంటాడాయన. దరిమిలా ఆయన రాసిన ‘పార్లెజ్ గ్లోబిష్‘ (గ్లోబిష్ మాట్లాడండి) ఇప్పుడు పలు దేశాలలో వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి బైబిల్ గా భాసిల్లుతోంది. ‘మూడో సహస్రాబ్ది ప్రపంచ మాండలీకం‘గా గ్లోబిష్ చాలా దేశాలలో ఇప్పటికే పాదుకొంటోంది. దీని మూలాలు ఆంగ్లంలోనే ఉండటం గమనార్హం.
నిజానికి ప్రపంచమంతటా వాడుకలో ఉన్న ఆంగ్లం అంతా ఒక్కటి కాదు. దానిలో 176కు పైగా వ్యవహార భేదాలున్నాయి. స్థానిక భేదాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఆసియా ఖండంలోనే ఆంగ్లానికి 16కు పైగా వ్యవహార భేదాలున్నాయి. అంతర్జాతీయంగా ఇటువంటి వ్యవహార భేదాన్ని సూచించడానికి ఆయా దేశాల పేరును ఇంగ్లీష్ అన్న పదంలోని కొంత భాగంలో కలిపి వ్యవహరించటం ఒక పద్ధతి. ఉదాహరణకు చైనాలో వాడుకలో ఉన్న ఇంగ్లీష్ ను ‘చింగ్లీష్‘ అంటారు. మన దేశంలో ఇంగ్లీషు భాషకు 12కి పైగా వ్యవహార భేదాలున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో వాడుకలో ఉన్న ఇంగ్లీష్ కు ‘భయ్యా ఇంగ్లీష్‘ అని పేరు. ఈ రకపు వ్యవహారానికి భిన్నమైన ఆంగ్ల వ్యవహారం మరో నాలుగు రూపాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం భాషా వ్యవహారానికి భిన్నమైన ఆంగ్ల భాషా వ్యవహారం దక్షిణాది రాష్ట్రాల్లో గమనించగలం. ఇన్ని వ్యవహార భేదాలున్నా భావ ప్రసార వ్యవస్థలో ఆంగ్లం తక్కిన భాషలకన్నా ముందు ఎలా ఉండగలుగుతోంది? ప్రపంచ వ్యాప్తంగా 6800 భాషలు వ్యవహారంలో ఉన్నా ప్రపంచ ప్రజలందరి లింక్ లాంగ్వేజిగా ఆంగ్లం ఎలా కొనసాగగలుగుతోంది? ఆయా సమాజాలలోని వ్యక్తుల, వ్యవస్థల అవసరాలు అంతగా ఆంగ్లంలో ఎలా పెనవేసుకొని పోయాయి?
చారిత్రకంగా ఆంగ్లానికి ప్రపంచమంతటితో సంబంధం ఉంది. ఇంగ్లీష్ పాలన మనల్ని విడిచి ఐదు దశాబ్దాలు దాటినా ఆంగ్ల మనల్ని విడవకపోవడానికి కారణం అంతకు ముందు దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర కలిగి ఉండటమే! అందువల్లే ఇప్పటికిప్పుడు మనం ఆంగ్లాన్ని విడిచి ముందుకు పోగలిగే పరిస్థితరిలేదు. పైగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేనిదే ఆకలి తీరదన్నది మన వ్యవస్థలో బాగా రూఢి అయిపోయిన సత్యం. భాష, వేషం, శైలి… ఒక్క మాటలో మన దైనందిన జీవితాలకు సంబధించిన సర్వ విషయాలూ ప్రత్యక్షంగా ఆ వ్యవస్థతోనే ముడిపడి ఉన్నాయి.
ప్రపంచ రాజకీయాలు, అత్యాధునిక వాదాలు, ధోరణులు, ఉద్యమాలు… వీటి ఫలితంగా ప్రజలందరి అనుభవంలోకి వచ్చిన విశ్వవ్యాప్త భావన, ఆంగ్ల భాషను ప్రపంచ భాషగా మార్చి వేశాయనటం నిస్సంశయంగా ఒప్పుకోవాల్సిన విషయం. పర్యవసానంగా చాలా దేశాలలో రోజు రోజుకూ భాషలు అంతరించిపోతున్నాయి. చాలా దేశి భాషలు మృత భాషల జాబితాలో చేరిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నిటా అనుసరిస్తున్న మార్కెట్ కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలు, రాజకీయాలు, మాద్యమ రంగాలు అన్నీ ఇంగ్లీషు శంఖం నుంచే వెలువడి ప్రజలకు చేరుతున్నాయిరు. అంతర్జాతీయ సమాజంలో ఆంగ్ల భాషకు ఉన్న తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రశ్నించే వ్యవస్థలు, వ్యక్తులు లేకపోలేదు. అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ అంతర్జాతీయంగా మాతృ భాషలను స్థానికీకరించే కార్యక్రమం ఇప్పుడిప్ప్పుడే వేగం పుంజుకొంటోంది. వివిధ భాషలను సమీకరించి, తత్కాల యంత్రానువాదం చేయగలిగే ఆధునిక పరిజ్ఞానం అంతర్జాతీయ సమాజంలో దైనందిన కార్యక్రమంగా మారేంతవరకు మాత్రం ఆంగ్లం ఇప్పటి స్థితిలోనే కొనసాగుతుంది.
మాతృ భాషల వాడకాన్ని రకరకాల సందర్భాలలో తగ్గించుకొంటూ పోవడం, ఆంగ్లాన్ని విరివిగా ఉపయోగించే సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఉండటం ‘గ్లోబిష్‘కు కలిసివచ్చే అంశాలు. అందువల్లే అది త్వరితగతిన ప్రపంచమంతా వ్యాపించగలుగుతోంది. ఆంగ్ల భాషలో ప్రాచుర్యంగా వాడుకలో ఉన్న1500 పదాలు మాత్రమే గ్లోబిష్‌లో ఉంటాయి. ఈ పదాలలోని వర్ణ క్రమానికి చేసుకొన్న కృతకమైన మార్పులు, అటువంటి పదాలతో ఏర్పడే చిన్న చిన్న వాక్యాలతో వ్యవహారం జరుగుతుంది. వాక్య నిర్మాణంలో ఇంగ్లీష్ వాక్య నిర్మాణాన్ని పోలి ఉండటం వల్ల ఆంగ్ల వ్యాకరణ పద్ధతి ‘గ్లోబిష్‘లో కనిపిస్తుంది. కాబట్టి ఆంగ్లంలో కొద్దిపాటి పరిచయం ఉన్నా గ్లోబిష్ త్వరితగతిన నేర్చుకొనే వీలుందని నెరియె వాదం. గ్లోబిష్ వ్యాపార భాష (నెరియె కాదంటున్నా). 15వ శతాబ్ది నుంచి యూరోపియన్ భాషలు ఇతర ఖండాలకు వ్యాప్తి చెందాయి. పోర్చుగీసు భాష అమెరికా, చైనా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా- వంటి ప్రాంతాలలోని స్థానిక భాషలలో కలిసి అనేక వ్యాపార భాషలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడ్డ వ్యాపార భాషలు ఎవరికీ మాతృ భాషలు కావు. ‘గ్లోబిష్‘ కూడా ఇటువంటిదే. అది ప్రపంచంలోని ఏ భాషా వ్యవహర్తకు మాతృ భాష కాదు. కానీ, ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృత సమాజాలను, దేశాలను మాత్రం గ్లోబిష్ విపరీతంగా ప్రభావితం చేయగలదు. ఎందుకంటే అది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొంటోంది.
సాధారణ ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్నవారంతా గ్లోబిష్ నేర్చుకొనేందుకు వీలుగా ‘గ్లోలెక్సిస్‘ అనే సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్లంలో మనం ఇచ్చిన పదంలోని ఏ భాగాన్ని తొలగించి లేదా తగ్గించి గ్లోబిష్ పదంగా మార్చుకోవచ్చో ఈ సాఫ్ట్‌వేర్ వివరిస్తుంది. ‘పార్లెజ్ గ్లోబిష్‘ వాచకం ఇప్పటికే ఇటాలియన్, స్పానిష్, కొరియన్, జపనీస్ భాషలలోకి అనువాదమయ్యింది. ప్రపంచ పర్యాటకుల భాషగా ఇప్పటికే గ్లోబిష్ స్థిరపడింది. భవిష్యత్తులో చాలా దేశాలలో ఆరోగ్య, విద్య, తదితర రంగాలలో ‘గ్లోబిష్‘ ప్రవేశించబోతోంది. బహుళజాతి సంస్థల్లో స్థిరపడ్డ భారతీయ యువత గ్లోబిష్ నేర్చుకోటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సరళీకృత ఆర్థిక రంగ ప్రభావంతో వచ్చే విదేశీ కంపెనీలలో భారతీయులకు చోటు దక్కాలంటే ‘గ్లోబిష్‘ గడప తొక్కటం తప్పకపోవచ్చు. ఈ సందర్భంలో మాతృ భాషల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం! ప్రపంచ దేశాలకు సంస్కృతిని, సాహిత్యాన్ని, జ్ఞానాన్ని అందించి మానవీయ విలువలను పెపొందించి, తద్వారా నాగరికతను నేర్పిన ఇటాలియన్, జర్మన్, స్పానిష్, సంస్కృతం మొదలైన భాషలు ఏం కాబోతున్నాయనేది జటిలమైన సమస్య. ఈ మాటనే నెరియెను అడిగినప్పుడు ‘సంస్కృతి వాహికలుగా భద్రపరచాల‘ని సమాధానమిచ్చాడు. బహుభాషా ప్రాంతాలైన భారతీయ సమాజంలో ఈ పని కష్ట సాధ్యమే కాని, అసాధ్యం మాత్రం కాదు. చరిత్ర, సంస్కృతి, నాగరికత మొదలైన అంశాలన్నిటితో ముడిపడి ఉన్న మాతృ భాషలను కాదని ఏ జాతి మనగలదు? వ్యాపార భాషలు సమాజంలో ఉన్నతిని కలిగించగలవేమోగాని మనసును ఉదాత్తీకరించలేవు. మానవతను పెంపొందించలేవు.ఈరెండూ అనుభవంలోకి రావాలన్నా రేపటి రోజు అర్థవంతంగా గడపాలన్నా – ఒకటికి మించి భాషలు నేర్వాల్సిందే